Telangana Budget : నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకే అధిక కేటాయింపులు!

Telangana Budget : నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకే అధిక కేటాయింపులు!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం గం.9కి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం పొందుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం ₹2.80లక్షల కోట్ల నుంచి ₹2.90లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అత్యధిక భాగం వ్యవసాయ శాఖకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి ₹30వేల కోట్లు, రైతు భరోసాకు ₹15వేల కోట్లతో కలిపి ఆ మొత్తం దాదాపు ₹50వేల కోట్లు ఉండొచ్చు. సంక్షేమ శాఖలకు ₹40వేల కోట్లు, సాగునీటిపారుదలకు ₹29వేల కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక విద్యుత్ శాఖ, వైద్య శాఖలకు చెరో ₹15వేల కోట్లు, గృహనిర్మాణ శాఖకు ₹8వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

రాష్ట్ర బడ్జెట్‌ నుంచి సాగునీటి రంగంలో ఎక్కువభాగం ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ₹29వేల కోట్లు ఈ రంగానికి కేటాయించే అవకాశం ఉండగా అందులో ₹18వేల కోట్లు రుణాలకు, ₹9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవ్వనున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు నిధులిచ్చే అంశంపై ఇటీవల మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షించారు.

Tags

Next Story