Telangana News : తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన.. ఎవరికి ఛాన్స్ వస్తుందో..?

Telangana News : తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన.. ఎవరికి ఛాన్స్ వస్తుందో..?
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర కేబినెట్‌లో త్వరలోనే ప్రక్షాళన జరగబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బహిరంగంగా ప్రకటించడంతో కేబినెట్‌లో మార్పులు తప్పవనే అంచనాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో నిజమాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో. అక్కడి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డామని, ప్రజల్లో మంచి పట్టుందని వీరు తమ అనుచరుల వద్ద చెబుతున్నారు.

ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తప్పిస్తారని తెలుస్తోంది. ఈ మ్యాటర్ ఇప్పుడు మంత్రుల్లో అసలు టెన్షన్‌కు కారణంగా మారింది. పనితీరు, ప్రజా స్పందన, పార్టీ ఇమేజ్ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రక్షాళన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరి పదవులు పోతాయో, ఎవరు కొనసాగుతారో అన్న టెన్షన్ మంత్రుల్లోనే కాదు, వారి అనుచరుల్లోనూ కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ప్రకటనతో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. వాస్తవానికి రెండో సారి మంత్రులను తీసుకున్నప్పుడే చాలా మంది పేర్లు వినిపించినా వారికి అవకాశాలు రాలేదు. చాలా మంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరి వారికి ఏమైనా ఛాన్సులు ఉంటాయా లేదంటే కొత్తవారికి ఎంకరేజ్ చేస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Tags

Next Story