తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్న ఏపీలోనే ఇప్పుడు కరెంట్ లేదు : కేసీఆర్

KCR : టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ 9వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు కె.కేశవరావు ప్రకటించారు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2001లో జలదృశ్యంలో గులాబీ జెండా పుట్టిందన్న కేసీఆర్.. కొద్దిమంది మిత్రులతో ఉద్యమ ప్రస్థానం మొదలైందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో, అనేక అనుమానాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ వస్తే ఏ రంగం కుంటుపడుతుందందని చెప్పారో.. అందులోనే ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు కేసీఆర్. తెలంగాణ వస్తే భూములు ధరలు పడిపోతాయి, కరెంట కోతలు ఉంటాయి, అభివృద్ధి కుంటుపడుతుందని కామెంట్ చేశారని, కాని దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. కరోనా కారణంగా 90 రోజులు లాక్‌డౌన్ ఉన్నా.. ఆ కష్టాన్ని అధిగమించి 11.5 శాతం వృద్ధితో దేశంలోనే టాప్ స్టేట్‌గా ఉన్నామన్నారు.
తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం అని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను చూసి.. పక్క రాష్ట్రం వాళ్లు సైతం తెలంగాణలో తమ ప్రాంతాన్ని కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నాందెడ్ ప్రాంత ఎమ్మెల్యేలు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమ దగ్గరా అమలు చేయాలని డిమాండ్ చేశారని, లేదంటే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారని చెప్పారు. రాయచూర్ ఎమ్మెల్యే సైతం మంత్రి సాక్షిగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలు చేయండి లేదా తెలంగాణలో కలపండి అని డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు. దళితబంధు ప్రకటించిన తరువాత.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టాలంటూ ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ఏపీలో పార్టీని ప్రారంభిస్తే.. గెలిపించుకోడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజ్ఞప్తి చేశారన్నారు సీఎం కేసీఆర్.
ఏపీలో కరెంట్ కోతలపైనా కామెంట్ చేశారు సీఎం కేసీఆర్. ఏ రాష్ట్రం నుంచి విడిపోయామో ఆ రాష్ట్రానికి ఇప్పుడు కరెంటు లేదు అని కామెంట్ చేశారు. తలసరి ఆదాయంలోనూ పక్క రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే.. ప్రతిపక్షాలు సహకరించకపోగా.. పథకాలను అడ్డుకోడానికి కేసుల మీద కేసులు పెట్టాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం.. ఇలా ప్రతి పథకం, అభివృద్ధి పనులపై కేసులు వేశారని ఆరోపించారు.
దళిత బంధు వల్ల సంపద సృష్టి జరుగుతుందన్నారు కేసీఆర్. తాను అందరిబంధువునని, కేవలం దళితుల కోసమే కాకుండా అందరి కోసం పథకాలు తీసుకొస్తామన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, వివిధ వర్గాల వారి కోసం వివిధ పథకాలు తీసుకొస్తామన్నారు. సభలు పెట్టొద్దని కేసులు పెట్టడంపై ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు కేసీఆర్. నాగార్జునసాగర్‌లో సభ పెట్టొద్దన్నారు.. కాని ఫలితం ఎలా వచ్చిందో అందరూ చూశారన్నారు. హుజురాబాద్‌లోనూ సభ పెట్టకుండా రాజకీయం చేశారన్నారు.
భారత దేశాన్ని తట్టిలేపిన పథకం దళితబంధు అని, ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్ ఆపేది కేవలం నవంబర్ 4వ తేదీ వరకేనని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి, దళిత బంధును పూర్తిచేస్తారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com