KCR: ఎన్నికల రణక్షేత్రంలోకి కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ముహూర్తం ఖరారు కావడంతో భారత రాష్ట్ర సమితి వేగం పెంచింది. ఇప్పటికే ఓ వైపు కేటీఆర్, హరీష్‌రావు, మరోవైపు అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తుండగా ఈనెల 15 నుంచి గులాబీ దళపతి కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 15న తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో గులాబీ దళపతి సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతోపాటు.. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తలు.. ఎన్నికల నియామళి, ప్రచార వ్యూహాలను అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు. అదే రోజున భారాస మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు.
సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక చేసిన కేసీఆర్.. ఈనెల 15నుంచే నియోజకవర్గాల్లో బహిరంగసభలకు శ్రీకారం చుట్టనున్నారు. గజ్వేల్, కామారెడ్డిలో నవంబరు 9న కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఎన్నికల సభలకు ఈనెల 15 నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల మాదిరిగా హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా ప్రణాళిక చేశారు. తెలంగాణ భవన్‌లో సమావేశం ముగియగానే.. హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈనెల16న జనగామ, భువనగిరిలో.. 17న సిద్దిపేట, సిరిసిల్లలో..కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో.. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రచారం నిర్వహిస్తారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. నవంబరు 9న నామినేషన్లు వేయనున్నారు. నవంబరు 9న తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేసి.. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నియోజకవర్గాల్లో పరిస్థితులపై భారాస నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. కేసీఆర్, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో అభిప్రాయం, పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో చర్చ, ఇతర పార్టీల బలాలు, బలహీనతలపై వివిధ కోణాల్లో నివేదికలు తెప్పిస్తున్నారు. వాటిని విశ్లేషిస్తూ ఎప్పటికప్పడు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 15న ప్రకటించనున్న మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరనుంది. ఆసరా ఫించన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం పెంపును ప్రకటించనున్నట్లు సమాచారం. రైతులకు పింఛన్లు, ఉచిత ఎరువులతోపాటు మహిళలు, యువత, బీసీలు, మహిళలను ఆకర్షించేలా ఎన్నికల హామీలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీలను తలదన్నేలా మేనిఫెస్టో ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com