TG : డ్రగ్స్ అమ్మాలంటే భయపడాలి.. కఠిన చర్యలు తీసుకోండి.. రేవంత్ వార్నింగ్

అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరస్తులకూ ఉపయోగపడుతోందని, ఫలితంగా సైబర్ క్రైం నేరాల సంఖ్య మితిమీరిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దిశగా నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీస్ అంటే నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ విక్రయదారులు తెలంగాణాలో అడుగు పెట్టాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకునే భయం కలిగించాలన్నారు.
ఈ క్రమంలో ఫిజికల్ పోలీసింగ్ అవశ్యమని, నిరంతర గస్తీతో పాటు సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. నేరాల నియంత్రణకు ఎన్ని కోణాల్లో అవకాశాలున్నా.. వాటిని ఉపయోగించుకోవాలని, అందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనకాడబోదని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సుధీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగమంతా నేరాల నియంత్రణకు నడుం బిగించాలన్నారు. బాదితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్తుల పట్ల మరింత కఠిన వైఖరి అవసరం.. అని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేదని పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలతో సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పబ్బులు విషయంలో టైమింగ్ పెట్టొచ్చని, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com