REVANTH: కేంద్రమంత్రులతో రేవంత్ కీలక చర్చలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆ సమావేశ అనంతరం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రం కేటాయించిన వరద సహాయాన్ని మరింత పెంచాలని అమిత్ షాను కోరారు. అలాగే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, మరింత మంది ఐఏఎస్ లను రాష్ట్రానికి కేటాయించాలని కూడ సీఎం అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇక ఖట్టర్ తో జరిగిన సమావేశంలో.. హైదరాబాద్ నగరంలో మురుగు నీటి శుద్ధీకరణకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు. కాగా రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు.
మెట్రోకు సహకరించాలని వినతి
హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేసేందుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌ఎంపీని అమృత 2.0లో చేర్చి, ఆర్థిక సహకారం అందించాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు.
మూసీ సీవరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల డీపీఆర్ కూడా..
హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నదని, ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతున్నదని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రేవంత్ రెడ్డి వివరించారు. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్టు తెలిపారు. ఆ డీపీఆర్‌ను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. దాన్ని ఆమోదించడంతోపాటు పనుల అనుమతికి చొరవచూపాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com