GP Jitender : తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ డీజీపీ

తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ జీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తన పదవీకాలంలో సాధించిన విజయాలు, పోలీసు శాఖ చేపట్టిన చర్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్త డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తన 15 నెలల పదవీకాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడానికి, క్రైమ్ రేటును తగ్గించడానికి అనేక కఠిన చర్యలు చేపట్టామని వెల్లడించారు. "డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గత 15 నెలల్లో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చాం. రాష్టవ్యాప్తంగా క్రైమ్ రేట్ తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టాం. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మొదటి స్ధానంలో ఉంది. నేరాల ఛేదనలో టెక్నాలజీ చాలా కీలకం" అని ఆయన అన్నారు.
సైబర్ క్రైమ్, బెట్టింగ్ మాఫియాపై యుద్ధం రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ నేరాలపై కఠినంగా వ్యవహరించామని జితేందర్ స్పష్టం చేశారు. "నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌లతో నిరంతరం యుద్ధం చేస్తున్నాం. బెట్టింగ్ మాఫియాపై లోతుగా దర్యాప్తు చేపట్టాం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశాం" అని తెలిపారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించామని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు.
భావోద్వేగానికి లోనైన జితేందర్ ఉద్యోగ రీత్యా కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జితేందర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com