తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల దందా..

తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల దందా..
X
కాలేజీల్లో యాజమాన్య సీట్లను వేలం పాట లాగా అమ్ముకుంటున్నారు.

తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల దందా కొనసాగుతుంది. కాలేజీల్లో యాజమాన్య సీట్లను వేలం పాట లాగా అమ్ముకుంటున్నారు. కన్వీనర్ కోటా సీట్లను సైతం పెద్ద ఎత్తున బ్లాక్ చేసి విక్రయించేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగుతున్న విద్యాశాఖలో మాత్రం ఎంతమాత్రం చలనం కనిపించడం లేదు.బడాబడా ఇంజనీరింగ్ కాలేజీలు సీట్లను బ్లాక్ చేసి యదేచ్చగా అమ్మకాలు సాగిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ కాలేజీలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి.ఇక IIT,NIT,IIIT, ఇతర డీమ్డ్ వర్సిటీల్లో సీట్లు ఖాయంగా వస్తాయనుకున్న వారు చాలా మంది ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చినా కౌన్సెలింగ్‌కు హాజరుకారు. ఎంసెట్ కౌన్సెలింగ్లో వీరు పాల్గొంటే బడా బడా కళాశాలల్లో అత్యంత డిమాండ్ ఉన్న బ్రాంచీలో సీట్లు దక్కుతాయి. దీంతో ఆయా విద్యార్థులతో కన్వీనర్ కోటా ద్వారా సీట్లను బ్లాక్ చేసి తర్వాత విక్రయించుకుంటూ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి

మరోవైపు విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనేలా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఒప్పందాలు కుదుర్చుకుటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయా విద్యార్థులు తమ కళాశాలలో సీఎస్ఈ సీటుకు ఆప్షన్ ఇచ్చి, స్లైడింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంటే వారు ఇంటర్ చదివిన కళాశాలల ప్రిన్సిపాళ్లకు రూ.50 వేల నుంచి రూ.75 వేలు, ఆ విద్యార్థి తల్లిదండ్రులకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామని ఆశ చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా తమ పిల్లలు చదువుకున్న కళాశాల ప్రిన్సిపల్ చెబుతున్నందున సమస్యలేవీ రావని తల్లిదండ్రులు అందుకు అంగీకరిస్తున్నారు. ఇలా సీట్లు పొందిన విద్యార్థులు ఒప్పందం మేరకు స్లైడింగ్ ప్రక్రియ పూర్తయ్యాక, తమకు ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటు వచ్చినందున వెళ్లిపోతున్నట్లు యాజమాన్యాలకు లేఖ ఇస్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్లో యాజమాన్యాలు రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు విక్రయించుకొంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా గత కొన్నేళ్ల నుంచి ఏటా 500 నుంచి 800 సీట్లను బ్లాక్ చేస్తున్నట్లు అంచనా. అంటే కనీసం రూ.40 కోట్ల నుంచి .64 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు.

తెలంగాణలో 165 ప్రైవేట్ కళాశాలలు ఉండగా టాప్ 20లోని పలు కళాశాలలతోపాటు దాదాపు 40-50 కళాశాలలు ఈ దందాను సాగిస్తున్నట్లు సమాచారం.జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చిన వారికి వారి ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ చేసి, ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొని సీటు పొందితే రూ. లక్ష వరకు ఇస్తారని చెబుతున్నారట. దీనివల్ల మిగిలిన ప్రతిభావంతులైన వారికి అన్యాయం జరగుతుందంటున్నాయి విద్యార్ధి సంఘాలు.మెడికల్ కళాశాలల కంటే ఇంజినీరింగ్ కళాశాలల అక్రమార్జనే అధికంగా ఉందంటున్నాయి విద్యార్ధి సంఘాలు. ఇక్కడ బీ కేటగిరీ, కన్వీనర్ కోటాలోని వేల సీట్లను అమ్ముకుంటున్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి.

Tags

Next Story