TS: మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి

TS: మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి
X
తెలంగాణ శాసనసభలో తీర్మానం.. మన్మోహన్ జీవితం ఆదర్శప్రాయమన్న ముఖ్యమంత్రి రేవంత్

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ కు భారత రత్న ప్రధానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కేంద్రానికి ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. మన్మోహన్ మరణం.. ఈ దేశానికి తీరని లోటుగా అభివర్ణించారు. నిర్మాణాత్మక, సరళీకృత విధానాలతో ప్రపంచపటంలో భారత్ ను నిలబెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ తరంలో మన్మోహన్‌తో పోటీ పడేవారే లేరన్నారు. మన్మోహన్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. తెలంగాణ సమాజం.. మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్‌కు ఎంతో రుణపడి ఉందన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. ఆర్థికవేత్తగా.. సంస్కరణలకు ఆద్యుడిగా మన్మోహన్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని రేవంత్ రెడ్డి కొనియాడారు. లెక్చరర్ నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మన్మోహన్ జీవితం ఎందరికో ఆచరణీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు.


అరుదైన, అసమాన్యమైన వ్యక్తి మన్మోహన్: భట్టీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేదల అభ్యున్నతి కోసం అనేక చట్టాలను చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మన్మోహన్ సింగ్ అరుదైన, అసమాన్యమైన వ్యక్తని కొనియాడారు. సంస్కరణలతో దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చారని భట్టి అన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన్మోహన్ పదవికే వన్నె తెచ్చారన్నారు. మన్మోహన్ ఆర్థిక మేధావని కొనియాడారు.

"సింపులి లివింగ్.. హై థింకింగ్.. ఇదే మన్మోహన్ లైఫ్"

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. గొప్ప ఆలోచనలను ఏ శక్తి ఆపేలేదు అనేందుకు మన్మోహన్ జీవితమే ఓ ఉదాహరణ అని కొనియాడారు. మన్మోహన్ హయాంలో దేశంలో చాలా సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. సింపులి లివింగ్.. హై థింకింగ్ మన్మోహన్ జీవిత శైలి అని కేటీఆర్ అన్నారు.

Tags

Next Story