TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
స్టే ఇచ్చేందుకు నిరాకరణ
అనర్హత పిటిషన్‌లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలి. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్‌పై పెట్టాలి. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించాలని అప్పీల్‌లో కోరారు. స్టే ఇవ్వడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ విషయం తమ పరిధిలో ఉన్నందున తుదివిచారణ చేపట్టే వరకూ ఏమీకాదని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన మూడు అప్పీళ్లపైనా 24వ తేదీన తుదివిచారణ జరుపుతామని.. ఆలోగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు వేసినా.. సింగిల్ జడ్జి ముందస్తు చర్యలు చేపట్టినా, కేసును రీ ఓపెన్ చేసినా.. వాటి గురించి తమ వద్ద ప్రస్తావించవచ్చని పేర్కొంది. ఆయన దాఖలు చేసిన మూడు అప్పీళ్లనూ తుది విచారణ కోసం ఈనెల 24న విచారణ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది.
పిటిషన్ ఇలా
తమ పార్టీలో గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. వేర్వేరుగా హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. సెప్టెంబర్ 9న తుది తీర్పు జారీచేశారు. అనర్హత పిటిషన్‌లను స్పీకర్ ఎదుట ఉంచాలని.. నాలుగువారాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ల విచారణకు షెడ్యూల్ జారీచేయాలని.. ఆ షెడ్యూల్ హైకోర్టు రిజిస్ట్రార్ కు అందజేయాలని.. లేనిపక్షంలో సూమోటోగా కేసు మళ్లీ రీఓపెన్ చేస్తామని తీర్పులో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com