Election : తెలంగాణ స్థానిక ఎన్నికలు.. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్?

తెలంగాణలో అందరూ ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శనివారం ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ డ్రాఫ్ట్‌లో మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి, సాయంత్రానికి ఎన్నికల ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా, మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరియు డీజీపీ జితేందర్ తో భేటీ కానున్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమ్మతి తెలియజేస్తూ ఆర్డర్ కాపీని అందజేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరం, ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంది వంటి తదితర అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com