TG: దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ రెవెన్యూ చట్టం

TG: దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ రెవెన్యూ చట్టం
X
ధరణిలో లోపాలు సరిదిద్దడమే తమ లక్ష్యమన్న పొంగులేటి... వందల ఎకరాల స్వాహాకు యత్నం జరిగిందన్న మంత్రి

ధరణిలో లోపాలు సరిదిద్దడమే తమ ఉద్దేశమని.... తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌మోడల్‌గా ఉంటుందని...తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ని తెచ్చారని... దీనివల్ల సామాన్య రైతులు, పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మరోవైపు తమకు కావాల్సిన వారికి ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికి ధరణిని వినియోగించుకొన్నారని ఆరోపించారు. ఇలా 2,800 నుంచి 3,100 ఎకరాలు స్వాహా జరిగినట్లు ఇప్పటికే విచారణలో తేలిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అన్నివర్గాలతో విస్తృతంగా చర్చించి, కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది దేశానికే రోల్‌మోడల్‌గా ఉంటుందన్నారు.

అప్పటి సీఎం కేసీఆర్‌, సీఎస్‌ ఇద్దరూ ధరణి ప్రపంచానికే ఆదర్శమన్నారని... మన రాష్ట్రంలో ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించిన సంస్థ ఒడిశాలోనూ చేసి, ఎత్తిపోయిందన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీ చేతిలో తాకట్టు పెట్టారని. ప్రభుత్వ స్థలాలను తమ తొత్తులకు కన్వర్ట్‌ చేసేందుకు సీక్రెట్‌ లాకర్‌ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒక సర్వే నంబరులో పది ఎకరాలుంటే అందులో ఒక్క భాగస్వామి ఫిర్యాదు చేసినా మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లిందన్నారు. ఏదైనా సర్వే నంబరులో... ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌ ఆస్తులు ఒక గుంట విస్తీర్ణంలో ఉన్నా... మొత్తం నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు.

గత పాలనలో కొన్ని వందల ఎకరాల స్వాహాకు యత్నం జరిగిందన్నారు. పేదల అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్‌ విలువతో వారికే ఇవ్వడానికి 58, 59 జీవోలు ఇచ్చారని తెలిపారు. వీటి దరఖాస్తుల విచారణకు... పక్క మండలాల రెవెన్యూ అధికారులను పిలిపించారన్నారు. కొన్ని స్థలాల్లో ఏమీ లేకున్నా ఇల్లో, షెడ్డో ఉన్నట్లు నివేదిక ఇప్పించి, వారి పేరుపైకి మార్చేశారని తెలిపారు. ఇలా లెక్కకు మిక్కిలి అక్రమాలు జరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికి 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని... వాటిలో 1.25 లక్షలు పరిష్కరించామన్నారు. మిగిలిన 1.20 లక్షలతోపాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చిన మరో 1.15 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని... మరో 15 రోజుల్లో ఇవన్నీ పరిష్కారమవుతాయన్నారు. 2020లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చేముందు సాదాబైనామాలు పరిష్కరిస్తామని, దరఖాస్తు చేసుకోమన్నారని గుర్తు చేశారు. ఐదారు రోజుల్లోనే 2.2 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వారం గడువు పెంచడంతో కొత్తగా ఏడు లక్షలు వచ్చాయని.... అన్నింటినీ పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు. దరఖాస్తుదారులు న్యాయస్థానానికి వెళ్లగా.. కొత్త చట్టంలో సాదాబైనామాల గురించి నిబంధనే లేదని కోర్టు తేల్చిందన్నారు.

Tags

Next Story