తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు
ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగు ముందే ఉంది

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎవరు చేజిక్కించుకుంటారో తెలియదుగానీ, అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.. ఈ విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగు ముందే ఉంది.. అన్ని వర్గాల మద్దతు కూడగడుతోంది.. అటు హైదరాబాద్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి వాణిదేవీకి ప్రైవేట్ కాలేజెస్‌ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ స్టాఫ్‌ వెల్ఫేర్ అసోయేషన్ మద్దతు తెలిపింది. సికింద్రాబాద్‌లోని మహబూబ్‌ కాలేజీలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక 6 నెలల్లోనే రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడితే చాలా సమస్యలు వస్తాయని ఆనాడు.. ఎన్నో అపోహలు కల్పించారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో ఎదిగేది బీజేపీ పార్టీ అని.. మునిగిపోయే పార్టీలు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లని బీజేపీనేత మురళీధర్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో మోదీ ఏది చెప్పారో.. అది చేసి నిరూపిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో సాధ్యం కావు అనుకున్న 370 జీవో, ఆయోధ్య రామమందిర నిర్మాణాలను సాధించి ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. టీఆర్ ఎస్ మాత్రం వాగ్దానాలు ఇచ్చి మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

ఆరేళ్లలో టీఆర్ఎస్ స‌ర్కార్ ప్రజ‌ల‌కు చేసిందేమీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రామచంద్రరావు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా స‌రిగా వాడుకోవ‌డం లేదని ఆరోపించారాయన. సమస్యల్ని ప‌రిష్కరించ‌డంలో కేసీఆర్‌ సర్కారు విఫ‌లమైందన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు అడిగే హ‌క్కు లేదన్నారు. గ్రాడ్యుయేట్లు, లాయ‌ర్లు అంతా తనకే మద్దతిస్తున్నారన్నారు. తొలి ప్రా‌ధాన్యతా ఓట్లతోనే గెలుస్తానని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అనురాగ్ యూనివర్శిటీ కేంద్రంగా బోగస్ ఓట్లు నమోదు చేయించారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. అనురాగ్ యూనివర్శిటీ గుర్తింపుతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని తీన్మార్ మల్లన్న అన్నారు.

అటు ఖమ్మం జిల్లాలో సైకిల్ యాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను జూలూరు పాడు చౌరస్తాలో నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద్యోగ అవకాశాలు లేక ఆటోలు నడుపుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పాలకులు ప్రజల గురించి ఆలోచించాలి గానీ.. వారిని పీల్చి పిప్పి చేయకూడదన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు సరైన సమాధానం చెప్పే అవకాశం వచ్చిందని భట్టి ఈ సందర్భంగా వారికి సూచించారు.

Tags

Next Story