Telangana Municipal Elections : కాంగ్రెస్ కు సవాల్ గా మారిన మున్సిపల్ ఎన్నికలు..

Telangana Municipal Elections : కాంగ్రెస్ కు సవాల్ గా మారిన మున్సిపల్ ఎన్నికలు..
X

అధికార కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు సవాల్ గా మారినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పాత, కొత్త నాయకుల మధ్యనే విభేదాలు తారా స్థాయికి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అట్టిపెట్టుకొని ఉన్న నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు తమకు హామీ మీదనే వచ్చామని.. కాబట్టి తమకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులకు ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది. ఇటు కరీంనగర్ లో చూసుకుంటే పాత నాయకులు, కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుంది. టికెట్లు ఇవ్వకుంటే రెబల్స్ గా పోటీ చేసేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. దీంతో వారందరినీ బుజ్జగించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది.

మంత్రి పొన్నం ప్రభాకర్ వరుసగా భేటీలు అవుతూ రెబల్స్ గా పోటీ చేయాలి అనుకుంటున్నా వారిని జారిపోకుండా చూస్తున్నారు. కానీ ఆయనను ఇప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటించలేదు. దాంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పొన్నం ప్రభాకర్ చేతిలోకి వెళ్తాయా లేదంటే వేరే మంత్రిని నియమిస్తారా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ మొదటి నుంచి కరీంనగర్ నేతగా ఇక్కడ పార్టీ మీద పూర్తిస్థాయి పట్టు ఉన్నది పొన్నం ప్రభాకర్ కు మాత్రమే. అందుకే ఆయనకే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కరీంనగర్లో బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తో పాటు బిఆర్ఎస్ లీడర్ల పోటీని తట్టుకోవాలి అంటే కచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు చీలిపోకుండా చూడాల్సిందే.

అందుకే మంత్రి ప్రభాకర్ వరుసగా భేటీలు అవుతూ కొందరిని బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎవరూ వెనక్కి తగ్గేందుకు ఇష్టపడట్లేదని సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీ మీదనే ఎక్కువ మంది ఫోకస్ ఉంటుంది కాబట్టి.. ఎవరు పోటీ చేసినా ఓట్లు చీలిపోయేది హస్తం పార్టీకి వచ్చేవే. కాబట్టి అసంతృప్తులను బుజ్జగించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దీన్ని పొన్నం ప్రభాకర్ ఎలా అధిగమిస్తారో చూడాలి.


Tags

Next Story