Telangana Panchayat Elections : సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. ఇక గ్రామాల్లో రాజకీయం.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి సంతరించుకుంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండో విడత, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు ఉంటాయి. మొదటి విడత నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, రెండవ విడత నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి, మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి వరకు ఎక్కువగా పట్టణాలకే పరిమితమైనా, ఇప్పుడు దృష్టి మొత్తం గ్రామాల పైకే మళ్లనుంది.
పార్టీలు గ్రామ స్థాయిలో వ్యూహాలు సిద్ధం చేస్తూ, కీలక నాయకులు గ్రామాలకు పయనమవుతున్నారు. చిన్నస్థాయి రాజకీయాల నడుమ పెద్ద పార్టీలు ఎలా తమ బలం ప్రదర్శిస్తాయో, ఎవరికి ఎంత ప్రజాభిమానం లభిస్తుందో ఈ ఎన్నికలతో స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో రాజకీయ చర్చలకు వేదికలు రెడీ అవుతున్నాయి. మూడు విడతల ఓటింగ్ పూర్తయ్యేసరికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రాజకీయ ప్రభావం పెరుగుతుంది. గ్రామాల్లో కుల సంఘాల మీటింగులు, మూకుమ్మడి హామీలు, దావత్ లు, బుజ్జగింపులు అన్నీ మొదలైపోతున్నాయి.
మొన్నటి దాకా జూబ్లీహిల్స్ లోనే మనకు రాజకీయం కనిపించింది. ఇక నుంచి గ్రామాల్లో మూడు పార్టీల రాజకీయం కనిపిస్తుంది. ఈ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేకపోయినా పార్టీల తరఫున గ్రామాల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని ఇప్పటికే అన్ని పార్టీలు టార్గెట్లు డిసైడ్ చేశాయి. సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పట్టు సాధిస్తే ఆ తర్వాత వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈజీగా ఎక్కువ సీట్లు గెలవొచ్చన్నది అన్ని పార్టీల ప్లాన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

