REVANTH: ఇందిరమ్మ రాజ్యమంటే కేసీఆర్‌ కడుపు మండుతోంది

REVANTH: ఇందిరమ్మ రాజ్యమంటే కేసీఆర్‌ కడుపు మండుతోంది
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్న రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ పాలనలో 30 లక్షల నిరుద్యోగులు పెరిగారని విమర్శ

ఇందిరమ్మ రాజ్యం అంటే సీఎం కేసీఆర్‌కు కడుపు మండుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్‌రెడ్డి దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్‌లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తామన్నMLA రఘునందన్‌రావు మూడేళ్లయినా సమస్యలు తీర్చలేదని ధ్వజమెత్తారు. దుబ్బాకకు రావాల్సిన నిధులు సిద్దిపేటకు తరలిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటలు విని రెండుసార్లు అధికారం ఇచ్చినా పేదల బతుకులు మారలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ లక్ష కోట్ల అవినీతితో పాటు హైదరాబాద్‌ శివార్లలో పెద్దఎత్తున భూములను ఆక్రమించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్లలో ప్రజలకు చేస్తామన్న పనులు చేయని సీఎం ఈసారి రెండుచోట్ల ఓడిపోవటం ఖాయమని రేవంత్‌ జోస్యం చెప్పారు. మాన అభివృద్ధి జరగాలంటే ఇందిరమ్మరాజ్యం రావాలని ఆకాంక్షించారు.


తెలంగాణ ప్రజల కోరికలు నెరవేరాలన్నా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ప్రజలు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఇవి అషామాషీ ఎన్నికలు కాదని.. నియంతృత్వ పాలన ఉండాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చే ఎన్నికలన్నారు. సాదుకుంటారా? చంపేసుకుంటారా?అని దొంగ ఏడుపు ఏడ్చి గెలిచిన వ్యక్తి ఈటల రాజేందర్‌ అని విమర్శించారు. కేసీఆర్‌తో యుద్ధం చేసి గెలిచిన ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారని, తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని రేవంత్‌ అన్నారు. దొరల పాలన పోవాలి అంటే కాంగ్రెస్‌ రావాలి. ఒక్క అవకాశం కాంగ్రెస్‌కి ఇవ్వండి’’ అని రేవంత్‌ ప్రజలను కోరారు.


మరోవైపు నేటి నుంచి కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకగాంధీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండింటికి పాలకుర్తిలో నిర్వహించే ప్రచారసభకు ప్రియాంక హాజరవుతారు. అక్కడి నుంచి హుస్నాబాద్ చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత 3 గంటల ప్రాంతంలో కొత్తగూడెం చేరుకుని అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత ఖమ్మం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 11గంటలకు ఖమ్మం, పాలేరు, ఒకటిన్నరకు సత్తుపల్లి, తర్వాత మధిర ప్రచార సభల్లో పాల్గొంటారు. తర్వాత విజయవాడ చేరుకుని అక్కడి నుంచి దిల్లీ బయలుదేరి వెళ్తారు.

Tags

Read MoreRead Less
Next Story