KTR : ఫోన్ టాపింగ్.. సిట్ విచారణపై లీకులెందుకు..?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ సిట్ విచారణ జరుగుతున్నంత సేపు చాలా లీకులు బయటకు వచ్చాయి. మొన్న హరీష్ రావును విచారిస్తున్న టైంలో ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో బిఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నానా హైరానా చేశారు. చివరకు పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగే దాకా వెళ్ళింది. ఇక నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తున్న టైంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధా కిషన్ రావును కూడా కేటీఆర్ తో కలిసి విచారించారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదే విషయం మీద విచారణ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. అలాంటివి ఏవీ నిజం కాదన్నారు. విచారణలో తాను తప్ప ఇంకెవరూ లేరని.. అనవసరంగా లీకులు ఇచ్చి లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. మరి ఇదే విషయం మీద సిట్ అధికారులు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు. నిజంగానే రాధా కిషన్ రావును పిలిచారా లేదా అన్నది బయట పెడితే అయిపోయేది కదా. ఇలాంటి లీకులు ఎవరిస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే కేటీఆర్ కూడా ఒక మాజీ మంత్రి, ఒక పార్టీలో అగ్ర నాయకులు. ఆయన పరువుకు భంగం కలుగుతుందని పదేపదే చెబుతున్నారు. సిట్ అధికారులు నిజాలు చెప్పాలి అనుకుంటే విచారణ చేసే టైంలో వీడియో రికార్డు చేశారు కాబట్టి దాన్ని బయటపెడితే అందరికీ అసలు నిజాలు తెలుస్తాయి అంటున్నారు.
మరి ఆయన చెప్పేది కూడా ఒక రకంగా నిజమే అనిపిస్తుంది. ఎలాంటి లీకులు బయటకు రాకపోతే ఆ వీడియోను బయటపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ లీకులు ఎవరు ఇచ్చినా సరే ఇక్కడ అంతిమంగా కేటీఆర్ కు నష్టం జరుగుతుంది అనేది గులాబీ పార్టీ నేతల భావన. ఏది ఏమైనా ఇలాంటి లీకులు ఇచ్చే బదులు ఈ కేసులు అసలు నిజానిజాలను సిట్ అధికారులు వీలైనంత త్వరగా బయటపెడితే అందరికీ అనుమానాలు తొలగిపోతాయి అంటున్నారు సామాన్య జనాలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
