Rythu Mahotsavam :11 నుండి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం

ఈనెల 11 నుండి 14 వరకు అగ్రి హార్టీ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు మహోత్సవం - 2025 ను నిర్వహిస్తున్న రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితోపాటు సభ్యులు భవానీరెడ్డి, గోపాల్రెడ్డి, కేవీఎన్. రెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు పండించే ఉత్పత్తులు, యంత్రపరికరాలు ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంటాయన్నారు. రైతులతోపాటు సామాన్య ప్రజలు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు కారణం అనేక కారణాలున్నాయన్నారు. పంట సాగుచేసినప్పుడు రేటు ఉంటుందని, కానీ ఆ దిగుబడి మార్కెట్కు పోయేసరికి ధర పడిపోతోందన్నారు. పంట పండించే రైతుకు పెట్టుబడి పెరుగుతుంటే... లాభసాటి ధర మాత్రం రావడం లేదని మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ కమిషన్ మొదటిది పంజాబ్లో ఉండగా రెండోది తెలంగాణలోనే ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం విశాల దృక్పధంతో సీఎం రేవంత్ రెడ్డి రైతు కమిషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో మిర్చి రేటును దళారులే నిర్ణయిస్తున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ పర్యటించిన తర్వాత సూర్యాపేటలో నకిలీ వరి సాగుచేసిన రైతులకు నష్టపరిహారం అందిందని గుర్తు చేశారు నేతలు. విత్తన కంపెనీలు రైతులకు నష్ట పరిహారం మొత్తాన్ని ముందే ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రైతుల సంక్షేమం కోసం కమిషన్ వేశారని, ములుగులో కమిషన్ పర్యటనతో విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, దళారులు బయటికొచ్చారన్నారు. ములుగులో చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కమిషన్ సూచించిందన్నారు. ఉత్తమ రైతు, ఆదర్శ రైతు విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. రైతు కమిషన్ ఆఫీస్ లో కూర్చొని పనిచేయడం కాకుండా క్షేత్ర స్థాయిలో తిరిగి పని చేస్తోందన్నారు. విదేశాల్లో మాదిరిగా ప్రకృతి వ్యవసాయంను ధ్రువీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com