TS POWER REFORM: విద్యుత్తు సంస్కరణల అమలును వ్యతురేకించిన తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణలు అమలు చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాలకు కేంద్రం తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపంలో తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోయింది. కేంద్రం చెప్పినట్టు నడుచుకుని, విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ర్టాలకు కేంద్రం ఇన్సెంటివ్ రూపంలో తాయిలాలు ప్రకటించింది. 12 రాష్ర్టాలకు లక్షా 43,332 కోట్ల ఇన్సెంటివ్‌లను మంజూరు చేసింది. వీటిలో సంస్కరణలు అమలు చేసినందుకు ఆయా రాష్ట్రాల GSDP లో 0.5 శాతం ఇచ్చే మొత్తం కూడా దాదాపు 66,413 కోట్లు ఉన్నాయి.రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా, డిస్కంలను ప్రైవేటీకరించడానికి దారులు తెరిచేలా ఉన్న సంస్కరణలను అమలు చేయనందుకు తెలంగాణ త్యాగం చేసి, వేల కోట్ల నిధులను వదులుకున్నదని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. తమకు సంస్కరణలు ముఖ్యంకాదని రైతుల సంక్షేమమే ముఖ్యమంటున్నారు.
కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల్లో విద్యుత్ రంగంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించడం, విద్యుత్తు రాయితీలను రద్దుచేయడం, క్రాస్ సబ్సిడీని ఎత్తివేయడం వంటి సంస్కరణలున్నాయి. అయితే రాష్ట్ర ప్రజానీకం విస్తృత ప్రయోజనాలను కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్కరణలను మొదటి నుంచి వ్యతిరేకించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు బిగించమని కుండబద్ధలు కొట్టారు. ఒక వేళ ఈ సంస్కరణలు రాష్ట్రం అమలుచేసి ఉంటే కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వచ్చేవి. కాని వీటిని ప్రజల కోసం వదులుకునేందుకు రాష్ట్రం సిద్ధపడింది. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్తు సంస్థలను నడుపుతామని, ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com