ఎలక్షన్ డ్యూటీపై వెళ్లిన భార్య కోవిడ్ తో మరణం.. ఎన్నికలతో జీవితాలు నాశనం అని భర్త ఆవేదన

సామాన్యుడి గోడు ఎవరిక్కావాలి. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. కరోనా సీజన్ అయినా మరొకటి అయినా వారికి పట్టదు. కోవిడ్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించి మీటింగులు, జన సమీకరణలు.. సాధారణ పరిస్థితుల్లోనే సామాజిక దూరం సాధ్యం కాని పని.. ఇక ఎన్నికల వేళ అవన్నీ గాలికి వదిలేయడమే. ఈ క్రమంలో ఓ టీచర్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్లి కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ,వారి 8 సంవత్సరాల కుమార్తె ఒంటరివారయ్యారు.
తెలంగాణలో ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏప్రిల్ 17 న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన కొద్ది రోజులకే COVID-19 తో మరణించారు. మహమ్మారి మధ్య రాజకీయాలు, ఎన్నికలతో జీవితాలు నాశనమైన 15 కుటుంబాల విషాద కథలలో వీరి కథ కూడా ఒకటి.
సంధ్య (35)కు ఏప్రిల్ 20 న జ్వరం వచ్చింది. తరువాత పరీక్షలు చేయిస్తే పాజిటివ్ అని తేలింది. వారం తరువాత, ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసియులో చేర్పించారు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో మే 8 న మరణించింది. భార్య మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భర్త కమ్మంపతి మోహన్ రావు. వారి 8 సంవత్సరాల పాప తల్లి లేనిదయ్యింది.
"నా భార్య మాత్రమే కాదు, నేనూ ప్రాణాలు కోల్పోయాను. ఎన్నికలు ఎందుకు జరిగాయి? కేవలం ఒక ఎమ్మెల్యే కోసం, చాలా మంది చనిపోయారు. నా కుటుంబం నాశనమైంది. లాక్డౌన్ తర్వాత లేదా అందరికీ టీకాలు వేసిన తరువాత ఎన్నికలు జరపవచ్చు కదా అని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు.
సంధ్య పోలింగ్ విధి కోసం హాలియాకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 14 న రెండు రోజుల క్రితం భారీ బహిరంగ సభను నిర్వహించారు. తరువాత, ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి, వందలాది మంది కార్యకర్తలకు కోవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కోవిడ్ -19 బారిన పడిన 500 మంది ఉపాధ్యాయులను కోవిడ్ యోధులుగా గుర్తించి పరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. మహమ్మారి సమయంలో ఎన్నికలు నిర్వహించడాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యను కరోనా సోకిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన మోహన్ రావు, పోలింగ్ రోజున అనేక మంది కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించారని ఆరోపించారు. 30 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని బస్సులో ఎక్కించి పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఐదుగురు పోలింగ్ సిబ్బంది, నలుగురు పోలింగ్ ఏజెంట్లతో సహా కనీసం పది మంది పోలింగ్ సమయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో కూర్చున్నారని ఆయన చెప్పారు.
బ్యాటరీ లేని లోపభూయిష్ట థర్మామీటర్‌ను నర్సులు తీసుకువచ్చారు. దాంతో ఎవరి టెంపరేచర్ చూడలేదని ఆయన ఆరోపించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు ఓటు వేయడానికి వచ్చినప్పుడు చివరి గంట వరకు పోలింగ్ సిబ్బందికి పిపిఇ కిట్ ఇవ్వలేదు.
సామాజిక దూరం పాటించమని చెబుతూనే ఉన్నారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి వేలికి సిరా రాయాలి, సంతకాలు తీసుకోవాలి. ప్రతి వ్యక్తికి ఒకటి నుండి రెండు నిమిషాలు పడుతుంది. అది గాలి, వెలుతురు లేని ఓ చిన్న తరగతి గది. అందులో కూర్చునే సిబ్బంది విధులు నిర్వర్తించారు. అందులో నాభార్య కూడా ఒకరు. కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు దీనిని సుమోటోగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో కనీసం 15 మంది ఉపాధ్యాయులు మరణించారని, వారిలో వందలాది మంది పోల్ డ్యూటీ సమయంలో పాజిటివ్ పరీక్షలు చేయించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com