REVANTH: సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం

REVANTH: సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం
X
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ... మంత్రులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన సీఎం...

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. సచివాలయమే అన్ని విధాలుగా సముచితమైన స్థానమైనందున అక్కడే సగౌరవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబరు 9న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజు, అందుకు కారకులైన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీని నిర్ణయించినట్లు వివరించారు. దేశ ప్రగతికి బాటలు వేసిన రాజీవ్‌ విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్ఠించడం సముచితమని. కానీ కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్‌ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారని... ఎవరైనా చేతనైతే విగ్రహంపై చేయి వేయండి చూద్దామంటూ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఓడిపోయినా బీఆర్‌ఎస్‌ నేతల తీరు మారలేదని... మీరు మళ్లీ అధికారంలోకి రావడం కలేనని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇక చింతమడకకే పరిమితమని... పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

దక్షిణ కొరియాలో ఒక యూనివర్సిటీకి చెందిన 16 మందికి ఒలింపిక్‌ పతకాలు వచ్చాయని రేవంత్‌ గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఆశయాల మేరకు యువతను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తలపెట్టిందన్నారు. అందులో భాగంగానే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్‌ వెల్లడించారు. మారుమూల తండాలు, గూడేలు, పట్టణాల్లో మరుగునపడిన క్రీడాకారులను వెలికితీసి.. అంతర్జాతీయ స్థాయి శిక్షణతో మెరికల్లా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వివరించారు.

రాజీవ్‌గాంధీ పగలు, రాత్రి తేడా లేకుండా దేశం కోసం పనిచేశారని, కొందరు చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. రాజీవ్‌ వల్లే ఐటీ రంగానికి పునాదులు పడ్డాయని, హైదరాబాద్‌ నగరాభివృద్ధికి ఆ పునాదులే కారణమన్నారు. అనంతరం పలువురు క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేశారు.

సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయ ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. డిజైన్, ప్రణాళికలపై ఉన్నతాధికారులతో చర్చించారు. మరోవైపు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, ఆమెర్‌ అలీఖాన్‌లు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.

Tags

Next Story