ఆగని "మున్సిపల్" పోరు మంటలు..!

ఆగని మున్సిపల్ పోరు మంటలు..!
X

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయినా సరే ఇంకా ఆ మంటలు చల్లారట్లేదు. ఇంకా మూడు చోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం తీవ్ర సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధిక మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నడవడంతో ప్రజలు ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ ఇవ్వకుండా చాలా చోట్ల హంగ్ ఇచ్చారు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీలో ఎంత రచ్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. చాలాచోట్ల అభ్యర్థుల కిడ్నాప్ లు, గొడవలు, దాడులు కూడా జరుగుతున్నాయి. మెట్ పల్లి మున్సిపాలిటీలో బిజెపికి అత్యధిక సీట్లు వచ్చినా సరే కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంతో.. కాషాయ పార్టీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేయడం సంచలనం రేపింది.

ఇంకోవైపు తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో బాల్క సుమన్ వర్సెస్ మంత్రి వివేక్ అన్నట్టు రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్ మీద బాల్క సుమన్ దాడి చేశారు అంటూ పోలీసులు ఆయన్ని అరెస్టు చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇలా చాలాచోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు పోరు జరుగుతుంది. ఏ ఎన్నికలు అయినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు జరగాలి కానీ.. పార్టీలో ఇష్టానుసారం జరిగితే ఇలాంటి గొడవేలే జరుగుతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కానీ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఒక పెద్ద గుణపాఠం అని.. ప్రజలు ఎవరికీ సరైన మెజారిటీ ఈ ఎన్నికల్లో ఇవ్వకుండా.. చాలా చోట్ల హంగ్ ఇవ్వడం అంటే అన్ని పార్టీల్లో ఒక టెన్షన్ మొదలైనట్టే. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలను మెప్పించే విధంగా రాజకీయాలు చేస్తేనే తప్ప.. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించట్లేదు.

Tags

Next Story