Hydra : అందుకే హైడ్రా.. నేనూ తగ్గేదేలేదు.. సీఎం రేవంత్ ఉగ్రరూపం

Hydra : అందుకే హైడ్రా.. నేనూ తగ్గేదేలేదు.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
X

తెలంగాణలో ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు.. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళ పాలకుల పాపమేనన్నారు. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు.

"చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాం. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు... స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం.... ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం....దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది. ఇది నా భరోసా.... ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా. " అన్నారు సీఎం.

"ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్‌కు ట్రాక్‌ రికార్డు ఉంది. సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే... గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశాం. ఆరు నెలల వ్యవధిలో 18 వేల కోట్ల రూపాయలు, 22 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా!? ఇదీ రైతుల విషయంలో మా కమిట్‌మెంట్‌." అన్నారు సీఎం.

Tags

Next Story