TGRTC : సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై టీజీఎస్ఆర్టీసీ ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుండగా.. 557 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకూ ఇవి అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు (AP) కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి నగరాలకు ఈ బస్సులు నడుస్తాయి.
తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులు సంస్థ ఏర్పాటు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రచించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com