Telangana : కాంగ్రెస్ లో మంత్రుల రగడ.. ముగింపు పలకాల్సిందే..

కాంగ్రెస్ లో మళ్లీ కల్లోలం రేగింది. ఏకంగా మంత్రులు బాహాటకంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన కామెంట్లు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఓ ప్రెస్ మీట్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్న ప్రభాకర్ చేసిన కామెంట్లు తీవ్ర సంచలనంగా మారాయి. వాటిపై మొదట్లో లక్ష్మణ్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. దళిత మంత్రిని అయిన తనను పొన్నం ప్రభాకర్ ఇలా అవమానించడం కరెక్ట్ కాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తోటి దళిత మంత్రిని అవమానిస్తుంటే వివేక్ వెంకటస్వామి చూస్తూ కూర్చున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. పొన్నం కేవలం తనను మాత్రమే కాకుండా మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం అవమానించారని చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.
అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడట్లేదని.. తన దగ్గర డబ్బులేదనే కారణంతోనే ఇలా తనను అవమానిస్తున్నారని ఆవేదన తెలిపారు. తాను పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని.. పొన్నం తన తప్పు తెలుసుకోవాలన్నారు. ఈ విషయంపై త్వరలోనే మీనాక్షి నటరాజన్, ఖర్గే, సోనియా, రాహుల్ ను కలుస్తానని చెప్పారు. దీంతో విషయం పెద్దది కావొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను అడ్లూరితో మాట్లాడాలని ఆదేశించారు. మహేశ్ కుమార్ గౌడ్ ఈ విషయంపై ఫోన్ చేయగా.. తాను హైదరాబాద్ రాగానే కలుస్తానని అడ్లూరి తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ప్రభుత్వ ఇమేజ్ ను కాపాడేలా మంత్రులు మాట్లాడాలన్నారు. పొన్నం వ్యాఖ్యలపై పార్టీ నిర్ణయం తీసుకకోవాలని సూచించారు. దీంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారింది. అసలే ఓ వైపు స్థానిక ఎన్నికలపై బీసీ రిజర్వేషన్ల రగడ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇంకో వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పెద్ద సవాల్ విసురుతోంది. కచ్చితంగా గెలిచి ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలాంటి టైమ్ లో మంత్రుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. పరిస్థితి మీడియాలో పెద్దది కాకముందే సరిచేసుకోవాలని సూచించినట్టు సమాచారం. మరి ఈ వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com