Telangana : సండే నుంచి మండే సూర్యుడు .. 45 డిగ్రీలు పక్కా

ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తన ప్రతాపం చూపెట్టబోతున్నాడు. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఎండలు మరింత పెరగనున్నాయి. మార్చి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ఈ మేరకు ఎండ తీవ్రతను సూచించే యెల్లో అలెర్ట్‌ను అన్ని జిల్లాలకు జారీ చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సగటున 15-20 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ, ఏపీలోనూ వడగాలుల తీవ్రత ఉండనుందని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గతేడాది కంటే ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండనుందని హెచ్చరించింది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి నుంచి మే వరకూ దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే దేశంలో ఐదింట నాలుగొంతుల ప్రాంతం వడగాడ్పుల ప్రభావానికి గురికానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com