Ponguleti Srinivasa Reddy : పేదోడి నుంచి పైసా వసూలు చేసిన క్షమించేది లేదు : మంత్రి పొంగులేటి

పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పేదవాడి నుంచి పైసా వసూలు చేసిన సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణకు ఆదేశించామన్నారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్ , ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించామని వివరించారు. ఇటువంటి ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాకూడా ఈ పధకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పేదల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం, బాధితులు నిర్భయంగా ఇందిరమ్మ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేస్తే దోషులను వదిలిపెట్టబోమని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com