Jubilee Hills : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపునకు కారణాలు ఇవే..

అందరూ ఊహించినట్టే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. మొదటి రౌండ్ నుంచి తిరుగులేని ఆధిపత్యంతో గెలుపును ఖాయం చేసుకుంది. మాగంటి సునీత ఒక్క రౌండ్ లో కూడా బలమైన ఆధిపత్యం చలాయించలేకపోయింది. నాలుగు రౌండ్లు అయ్యేసరికి కాంగ్రెస్ భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. పోలింగ్ జరిగిన రోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. మొత్తానికి బిఆర్ ఎస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ గెలుపునకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏ ఉప ఎన్నిక అయినా సరే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పైగా జూబ్లీహిల్స్ లో ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన సింపతి నవీన్ యాదవ్ కు ఉంది. దీంతోపాటు అధికార పార్టీ బలం కలిసి వచ్చింది.
జూబ్లీహిల్స్ లో మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కే ఎక్కువ పడ్డాయి. దీని వెనకాల ఎంఐఎం మద్దతు ఉంది. అటు బిఆర్ఎస్ వైపు చూస్తే మాగంటి సునీత కేవలం సెంటిమెంట్ ను మాత్రమే నమ్ముకుంది. ప్రచార బాధ్యతలు మొత్తం కేటీఆర్ తన భుజాన వేసుకున్నాడు. ఒక్కచోట కూడా మాగంటి సునీత పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వలేకపోయింది. కనీసం తనను గెలిపిస్తే ఏం చేస్తాను అనే విషయం కూడా ప్రజలకు ఆమె స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రచారం మొత్తం కేటీఆర్ మాత్రమే చూసుకున్నాడు. సునీతను సెంటిమెంటల్ ఓట్ల కోసం సైలెంట్ గా ఉంచారు. ఏ ఎన్నికల్లో అయినా అక్కడ పోటీ చేసే అభ్యర్థి ప్రజల్లో నమ్మకాన్ని సాధించాలి. ప్రజలకు తాను ఏం చేస్తాను అనేది చెప్పి చూపించుకోవాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. గులాబీ పార్టీ ఎక్కువగా సెంటిమెంటల్ ఓట్లనే నమ్ముకుంది.
మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఏ అభ్యర్థి అయినా సరే ఎక్కువసార్లు కంటిన్యూగా గెలుస్తున్నాడు అంటే అతని మీద ఎంతో కొంత వ్యతిరేకత కచ్చితంగా ఉంటుంది. పైగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ బరిలో లేడు కాబట్టి ఆ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడంలో మాగంటి సునీత, బిఆర్ఎస్ పార్టీ కొత్త వెనుకబడింది. పైగా బిజెపితో ఢీ అంటే ఢీ అన్నట్టు కేటీఆర్ ప్రచారం చేయలేకపోయారు. ఎంతసేపు కాంగ్రెస్ ను మాత్రమే కార్నర్ చేశారు. దీంతో బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే అనే ప్రచారం ఎక్కువగా వైరల్ అయింది. పైగా గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం ఒక పెద్ద మైనస్. పైగా గులాబీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కెసిఆర్ ఫీల్డ్ లో లేకపోవడంతో ప్రజలు కూడా ఆ పార్టీని పెద్దగా నమ్మట్లేదు. గ్రౌండ్ లెవెల్ లో బిఆర్ఎస్ పార్టీ ఈ రెండేళ్లలో బలాన్ని పెంచుకోలేకపోతోంది. కేవలం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటుంది. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రియాలిటీని గులాబీ పార్టీ గ్రహించలేకపోతే కష్టమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

