TG : ఇది భూ భారతి కాదు .. భూ హారతి : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

TG : ఇది భూ భారతి కాదు .. భూ హారతి : పల్లా రాజేశ్వర్​ రెడ్డి
X

తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదించిన చ‌ట్టం భూ భార‌తి కాదు భూ హార‌తి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్​ చేశారు. కాంగ్రెస్ నేత‌ల భూక‌బ్జాల‌కు, రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్లకు మంగ‌ళ హారతి ప‌ట్టనుంద‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 75 లక్షల మంది రైతుల‌కు సంబంధించి కోటి 50 లక్షల ఎకరాలకు ధరణి చట్టం హక్కులు కల్పించింది. భూ భారతి చట్టం రైతుల పాలిట పిడుగుపాటు లాంటిదే. ఏదైనా కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి. ఇప్పుడు ధరణిని కూడా పిచ్చి కుక్కగా ముద్ర వేసి చంపేశారు. ఎలుక చొచ్చిందని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ ప‌రిస్థితి. ఇక రేపటి నుంచి పేదలకు కష్టాలు మొదలవుతాయ‌ని ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కొత్త దుకాణాలు మొదలై భూ భారతితో అవినీతి విచ్చలవిడి అవుతుంది. ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యుటేషన్ అనేది మరో అవినీతి దుకాణం. కేసీఆర్ తెచ్చిన బ్రహ్మాండమైన చట్టాన్ని నీరు గార్చారు. భూభారతితో రైతుల గుండె దడ మొదలైంది. భూ భారతి చట్టాన్ని బీఆర్ఎస్ తిరస్కరిస్తోంది. ధరణితోనే రైతుబంధు పారదర్శకంగా సాగింది. రైతులతో కలిసి భూ భారతిపై పోరాటం చేస్తాం’’ అని ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

Tags

Next Story