Weather Forecast : ఈసారి ముందే రానున్న ఎండాకాలం

నాలుగు నెలల పాటు చలికి వణికిపోయిన ప్రజలపై ఇప్పుడు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సగటు మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల దాకా చేరుతున్నాయంటే భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో వాతావరణశాఖ కీలక హెచ్చరిక చేసింది. రాబోయే మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీ లమేర పెరగనున్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతుండడంతో మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తున్నా రాత్రి పూట పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. పగలు, రాత్రి సమయాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోత మొదలైంది. ఫిబ్రవరి తొలివారంలో పరిస్థితులు ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే ఫిబ్రవరి నుంచే ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చ స్తోంది. సహజంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్ చాలా చాలా కూల్ ఉంటుంది కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఒక ముందుగానే ఎండలు మండిపోతాయని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com