CM Revanth Reddy : హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారు ప్రజలకు శత్రువులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, అందుకే నేడు ఎంతోమంది తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. 1994 నుంచి 2014 వరకు అప్పటి సీఎంలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌ను అడ్డుకునే వారు శత్రువులు
హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న తెలుగువారు తమ పనిని ఆపేస్తే అక్కడ ఐటీ రంగం స్తంభించిపోతుందని చెప్పారు. తెలంగాణలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రతను కల్పించామని, రాబోయే పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అయితే, కొందరు వ్యక్తులు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మూసీ ప్రక్షాళన మరియు ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని వ్యతిరేకించేవారు ప్రజలకు శత్రువులని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పేద ప్రజలు మూసీ మురికిలోనే జీవించాలని ఎవరూ కోరుకోరని ఆయన అన్నారు.
మూసీ ప్రక్షాళనతో పాతబస్తీకి పూర్వ వైభవం
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం 'తెలంగాణ రైజింగ్ 2047' ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీనిలో భాగంగా మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులు జరగాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీని పాత నగరంగా కాకుండా ఒరిజినల్ సిటీగా అభివర్ణించారు. మూసీ ప్రక్షాళనతో పాతబస్తీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com