Minister Ponguleti : ఆ రెండు పార్టీలు తోడుదొంగలుగా మారి బీసీ బిల్లును అడ్డుకున్నాయి - పొంగులేటి

బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొంగులేటీ మండిపడ్డారు. రెండు పార్టీల నాయకులు తోడు దొంగలుగా మారి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 564 మంది లబ్ధిదారులకు కాళోజీ కళాక్షేత్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టు పట్టిపోయాయని.. తాము వచ్చాక వాటిని సెట్ చేసే పనిలో పడినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడ్డ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టినట్లు తెలిపారు. బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి కేంద్రానికి పంపామని.. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఆ బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కాంగ్రస్ చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com