Hyderabad : కాంపౌండ్ వాల్ మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి

వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని అడ్డా కూలీలు.. బతుకుదెరువు కోసం ఏండ్ల కిందట ఇతర జిల్లా నుంచి సిటీకి వలస వచ్చారు. చిన్న చితక పనులా చేస్తూ బతుకుబండిని లాగుతున్నారు. కూలీ పనిచేసే సమయంలోనే జరిగిన ప్రమాదంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా సీతారామపురం తండాకు చెందిన వీరయ్య, రాము, వాసులు పెద్దఅంబర్పేటలో ఉంటూ అడ్డాకూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిని సెల్లార్ కూల్చే పని కోసం కాంట్రాక్టర్ ఎల్బీనగర్ కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పని చేస్తుండగా పక్కనే ఉన్న ఆదే స్థలానికి చెందిన కాంపౌండ్వాల్ కూలిపోయింది. దీంతో గోడకు సంబంధించిన మట్టిపెళ్లలు పై నుండి కూలి పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక క్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుతున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకొని ఒకరి డెడ్ బాడీని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దశరథ అనే కూలీని కామినేని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మృతులంతా ఒకే కు టుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు వీరయ్య, రాముతో పాటు బామ్మర్ధి కొడుకు వాసులు చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com