Minister Tummala : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తుమ్మల ఫైర్ !

రాష్ట్రంలో యూరియా కొరత పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే వాస్తవాలు దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి గారికి యూరియా సరఫరా లో జియో పాలిటిక్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎర్ర సముద్రంలో నౌకాయనం నిలవడం వల్ల యూరియా ఇంపోర్ట్ డిమాండ్ కు తగ్గ స్థాయిలో లేదని కిషన్ రెడ్డి ఓ పక్క చెబుతూనే మరోపక్క యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆరోపణలు చేయడం వారి ద్వంద వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరత పై వాస్తవాలు దాచి ,కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా యూరియా కొరత నెలకొంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లేలా వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి తగినట్లు లేదని మంత్రి తుమ్మల హితవు పలికారు.
తెలంగాణ ప్రజానీకం మీకు ఓట్లు వేసి గెలిపించారు అందువల్లే మీరు కేంద్ర మంత్రి అయ్యారు.తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలు తీరేలా కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకుని యూరియా సరఫరా చేయించండి అదనంగా యూరియా సరఫరా చేస్తే రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతాం. అలా చేయకుండా కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్ల ఏర్పడిన యూరియా కొరత పై వాస్తవాలు దాచి రాజకీయ ఆరోపణలు చేయడం తగునా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు.యూరియా కొరత పై మంత్రులు పదే పదే చెప్పడం వల్లే రైతులు ముందే కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బురద జల్లేలా ఉన్నాయని,యూరియా సరఫరాలో జాప్యం ఇంపోర్ట్ లేకపోవడం దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం వల్లేనన్న వాస్తవాలు మా మంత్రులు రైతాంగం కు వివరిస్తుంటే మంత్రులు పై అభాండాలు వేయడాన్ని మంత్రి తుమ్మల తీవ్రంగా ఆక్షేపించారు. కిషన్ రెడ్డి గారు మీకు తెలియంది కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది మూడో పంటకాలం.గత ఏడాదిన్నర కాలంలో యూరియా కోసం రైతులు యెప్పుడు ఆందోళన చెందలేదు. ఈ దఫా ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయక పోవడం వల్లే కదా, వాస్తవాలు అలా ఉంటే మీరు వాస్తవాలు దాచి రాజకీయ ఆరోపణలు చేయడం తగునా.
.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ వానాకాలం సాగుకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేశారు. ఆగస్ట్ 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి కానీ ఇప్పటివరకు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది.ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవ్వలేదు.దాంతో తెలంగాణలో యూరియా కొరత నెలకొంది.ఆగస్ట్ లో యూరియా వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆందోళనగా ఉన్నారు.
కిషన్ రెడ్డి గారు ఈ వాస్తవాలు పై ఏం సమాధానం చెబుతారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా లో వైఫల్యం చెందితే ఆ నెపం ఒప్పుకోకుండా వాస్తవాలు దాచి రాష్ట్ర ప్రభుత్వం పై రాజకీయ ఆరోపణలు చేయడం మీ పరపతి తగ్గేలా ఉందన్నారు. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతగా మీరు ప్రకటించిన యాభై వేల టన్నుల యూరియా తక్షణమే సరఫరా అయ్యేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతాంగం పక్షాన ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com