TG : ఈ నెలాఖరుకు కమిటీల ఏర్పాటుకు టీపీసీసీ కసరత్తు

కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు ఈ నెలాఖరుకు గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా కమిటీల నియామకాలు పూర్తి చేయాలని టీపీసీసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రకమిటీ కూర్పు వైపు ఎఐసీసీ దృష్టిసారించగా, మరోవైపు జిల్లా కమిటీల ఎన్నిక బాధ్యతలను పరిశీలకులు నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎఐసీసీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు గుజరాత్ మోడల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇది వరకే టీపీసీసీ పరిశీలకులకు సూచించిన విషయం తెలిసిందే.
జిల్లాకు ఇద్దరు, జీహెచ్ఎంసీ పరిధిలో ఐదుమంది చొపన రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది పరిశీలకులను టీపీసీసీ నియమించింది. తమకు కేటాయించిన బాధ్యతల మేరకు పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా తమకు కేటాయించిన నియోజక వర్షాల్లో పర్యటిస్తున్నారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచు కోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించింది. అంతేగాక ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో విఫలమైనట్లు పార్టీ గుర్తించింది. ఈ విషయంలో జాప్యం చేస్తే పార్టీ, ప్రభుత్వం ఉనికికే ప్రమాదం ఉంటుందని భావిస్తోంది.
అందువల్ల ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా ఈ నెలాఖరులోగా స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న నేతలతో పాటు 2017 నుంచి పార్టీ మారని వారిని కమిటీల్లో నియమించాలని సూచించింది. సామాజిక సమతుల్యతను పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్బీ బీసీ, మైనారిటీ, ఓసీలను కమిటీల్లో నియమించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com