TG : మహబూబాబాద్‌లో ట్రాక్ రెడీ.. 2 రోజుల్లోనే మొదలైన రాకపోకలు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభ వార్త చెప్పింది. బుధవారం నుంచి సికింద్రాబాద్-విజయవాడ, వరంగల్- విజయవాడ మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెప్పింది. భారీ వర్షాలకు మహబూబాబాద్ తడల పూసలపల్లి వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేసింది. ట్రయల్ రన్ కూడా పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలి వరదలకు ఇక్కడి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వే 48 గంటల్లోనే తాళ్ల పూసలపల్లి దగ్గర ట్రాక్ ను పునరుద్ధరించింది.
దాదాపు 1000 మంది సిబ్బంది మూడు రోజులపాటు శ్రమించి యుద్ధప్రాతిపదికన ట్రాక్ ను పునరుద్దరించింది. ఈ మార్గంలో నిత్యం 82 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ప్రధాన రైల్వే ట్రాక్ ఇదే. దీంతో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే కీలకమైన రైల్వే లైన్ కూడా ఇదే.. శనివారం రాత్రి భారీ వర్షాలకు ట్రాక్ కొట్టుకుపోవడంతో మూడు రోజులపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 531 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పెద్ద సంఖ్యలో రైళ్లను దారిమళ్లించి నడిపింది. రైళ్లు నిలిచిపోవడంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com