TRS: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్..

TRS: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తోంది టీఆర్‌ఎస్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై వీలైనంత మేర ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై వెనక్కి తగ్గకూడదని, పార్లమెంటు లోపలా, బయటా గట్టిగా పోరాడాలని టీఆర్‌ఎస్ పార్టీ తీర్మానించింది.
నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలతో ఐదున్నర గంటల పాటు చర్చించిన సీఎం కేసీఆర్.. బీజేపీతో అమీతుమీ తేల్చుకోవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడాలని, ధర్నాలతో పార్లమెంటుతో పాటు దేశం మొత్తం దద్దరిల్లాలని సూచించారు.ఈ ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్.
రాష్ట్రంపై కక్ష గట్టినట్లు కేంద్రం వ్యవహరిస్తోందని, విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని కేసీఆర్ విమర్శించారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు కేసీఆర్. ఏపీ ప్రభుత్వం, కేంద్రం వైఖరి కారణంగా షెడ్యూల్ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ దృష్టి మొత్తం.. దేశంపై గుత్తాధిపత్యం సాధించడం మీదే ఉందని విమర్శించారు. రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు.. ప్రాంతీయ పార్టీ నేతలపై సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. సెస్సుల రూపంలో రాష్ట్రాలకు నిధులు రాకుండా అడ్డుకుంటోందని, పన్నుల వాటాలోనూ రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులేం ఉండకపోవచ్చని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలకు, పార్టీ పరంగా ప్రయోజనాలున్న రాష్ట్రాలకే కేంద్రం పెద్దపీట వేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే, తొలిరోజే పార్లమెంట్‌ను బహిష్కరించడం ద్వారా టీఆర్‌ఎస్ వైఖరి తెలియజేయాలన్నారు కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com