తెలంగాణలో జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు

తెలంగాణలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జోరందుకుంది.. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటించారు.. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అందరి పార్టీ అని.. ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుపోవాలన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రతిపక్షాలపైనా కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకట్రెండు విజయాలకే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని.. తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు. టీఆర్ఎస్ లేకపోతే.. టీ కాంగ్రెస్, టీ బీజేపీ బీజేపీ ఏర్పడేవి కావని.. అది కేసీఆర్ భిక్ష అని అన్నారు.
సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు.. టీఆర్‌ఎస్ కార్యకర్తలతో పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు.. త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించామని హరీష్‌రావు గుర్తుచేశారు. గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా గురుకుల పాఠశాలలు స్థాపించి కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మనమే పరిష్కరించుకోవాలని పార్టీ శ్రేణులకు హరీష్‌రావు సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం, మండల పర్యటనల్లో అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కార్యకర్తలతో సమావేశం అవుతానని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
అటు జిల్లాల్లో మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి.. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియే ప్రధాన ఎజెండా మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులు, పథకాల లబ్ధిదారులను పార్టీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని పిలుపునిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com