MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. టీఆర్ఎస్ నాయకుడే నిందితుడు..

MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. టీఆర్ఎస్ నాయకుడే నిందితుడు..
MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యా కుట్ర తెలంగాణలో సంచలనంగా మారింది.

MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యా కుట్ర తెలంగాణలో పెను సంచలనంగా మారింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసం వద్దే ఆయన్ను మట్టుబెట్టేందుకు ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎన్ క్లేవ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రసాద్‌గౌడ్‌ను గుర్తించిన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రసాద్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు పిస్టళ్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని చంపేందుకు వచ్చిన వ్యక్తి ఆర్మూర్ నియోజకవర్గంలోని మక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య భర్తగా గుర్తించారు. ప్రసాద్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు నియోజకవర్గానికి చెందిన నాయకుడే ప్రయత్నించడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ప్రసాద్‌గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి అనుచరుడుగానే ఉన్నారు. అయితే సర్పంచ్ పదవి నుంచి తన భార్య లావణ్యను తప్పించడం వెనుక ఎమ్మెల్యే ఉన్నారనే కారణంతో జీవన్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నారు.

ఎలాగైనా ఎమ్మెల్యేను చంపాలన్న కసితో మంగళవారం ఉదయం జీవన్‌రెడ్డిని కలవడానికి నియోజకవర్గం నుంచి వచ్చిన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రసాద్‌గౌడ్ కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలతోనే కలిసి బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. అయితే.. ఇటీవలే ఎమ్మెల్యేకి వార్నింగ్‌ ఇస్తూ సెల్ఫీ వీడియోలో ప్రసాద్‌గౌడ్‌ మాట్లాడిన నేపథ్యంలో జీవన్‌రెడ్డి ఇంటికి ఎందుకొచ్చారని కార్యకర్తలు అనుమానించారు. ఇంతలో అతని అనుమానిత కదలికలతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో ఎమ్మెల్యే హత్యకుట్ర ప్లాన్ మొత్తం బయటపడింది.

మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కూడా నిందితుడు ప్రసాద్‌ గౌడ్ కదలికలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు ప్రసాద్‌గౌడ్ మొబైల్‌ చెక్ చేస్తే అందులో హత్య కోసం 50 వేల రూపాయలు పెట్టి తుపాకీ కొన్న మెసేజ్‌లు కూడా వాట్సప్‌లో కనిపించాయి. దీంతో పాటు ప్రసాద్‌గౌడ్ ల్యాండ్ సెటిల్మెంట్‌ వ్యవహారాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మర్డర్‌ ప్లాన్‌ ఎపిసోడ్‌పై ప్రసాద్ గౌడ్ భార్య, కల్లెడి మాజీ సర్పంచ్‌ లావణ్య ఖండించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని కలుద్దామని వెళ్లిన తన భర్తపై కావాలనే నేరం మోపారని ఆరోపించారు. తమ పదవి విషయంలో జీవన్‌రెడ్డిని కలుస్తూనే ఉన్నామని చెప్పారు.

బిల్లులు ఆపి తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని.. కావాలనే కుట్ర కేసులో తన భర్తను ఇరికించారన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు ఆపేసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తమను వేధించారని లావణ్య ఆరోపించారు. ఏదిఏమైనా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు ఇటీవలి వరకూ అనుచరుడిగా ఉన్న వ్యక్తి, అదీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ వస్తున్న ప్రసాద్‌గౌడ్ ఇలా హత్యకు కుట్ర పన్నడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మరి మున్ముందు ఈ మర్డర్ ప్లాన్ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది..? ఇంకెన్ని సంచలన విషయాలు బయటకొస్తాయనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story