Telangana: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన తెలంగాణ..

Telangana: కేంద్రంపై పోరులో భాగంగా ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తోంది టీఆర్ఎస్. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. కూకట్‌పల్లిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తున్నది తెలంగాణ మాత్రమేనని అన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశాన్నే అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలని ఆరోపించిన ఎమ్మెల్యే..కేపీహెచ్‌బీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
మోదీ ప్రభుత్వం వల్ల దేశానికి ఏ ప్రయోజనమూ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, శ్రామిక వ్యతిరేక నిర్ణయాలపై అవసరమైతే ఢిల్లీలోనైనా ఆందోళన చేస్తామన్నారు. అటు వరంగల్ జిల్లాలోనూ పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డోర్నకల్ నియోజకవర్గంలో మహబూబాబాద్ ఎంపీ కవిత , గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ గుడిపూడి నవీన్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. కేంద్రం రైతులతో రాజకీయం చేయడం ఆపేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com