TRS to BRS: బీఆర్ఎస్.. కేసీఆర్ ప్లాన్ వర్కవుటవుతుందా!!

KCR-BRS: తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముహూర్త సమయానికి ఈసీకి పంపాల్సిన పేపర్లపై సంతకం చేశారు. ఈ వేడుకల్లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాష్ రాజ్, టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. పేపర్లపై సంతకం తర్వాత కుమారస్వామికి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పారు కేసీఆర్.
ఈ సందర్భంగా కేసీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పారు కుమారస్వామి, ప్రకాశ్ రాజ్. తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్ స్థానంలో భారత్ మ్యాప్ ఉంచారు. ఇక పార్టీ గుర్తుగా కారు యధావిధిగా కొనసాగనుంది. మరోవైపు తెలంగాణ భవన్ ఎదుట పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అటు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయడమే లక్ష్యంగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు గులాబీ బాస్. దేశంలో గుణాత్మక మార్పు అవసరమంటూ నేషనల్ లెవల్‌లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే దేశంలో 8 జాతీయ పార్టీలుండగా.. తాజాగా ఆ జాబితాలో ఆమ్ ఆద్మీ సైతం చేరింది.
కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. వీటిలో ఎన్సీపీ, ఎన్‌పీపీ, టీఎంసీలు మొదట ప్రాంతీయ పార్టీలుగా ఉండగా...తర్వాత జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి.
ఐతే ఇప్పుడు కేసీఆర్ ఆలోచనల్లో ఉన్న బీఆర్ఎస్...ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్ విద్య, వైద్యం మోడల్ నినాదం ఎత్తుకోగా...24 గంటల విద్యుత్ సరఫరా, దేశంలోని ప్రతి మూలకు సాగునీరు అందించడమే లక్ష్యమని కేసీఆర్ పదే పదే చెప్తున్నారు.
ఇందులో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలపై కేసీఆర్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బలం చూపించుకుని తర్వాత దేశం మొత్తం విస్తరించాలనేది గులాబీ అధినేత ప్లాన్‌గా సమాచారం. ఇప్పటికే జేడీఎస్ నేత కుమారస్వామితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు.
తెలంగాణ పథకాలకు ఆకర్షితులై గతంలో కొందరు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన సరిహద్దు గ్రామాల వారు తమను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చింది. నిజాం హయాంలో మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఉండటంతో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇక్కడి ప్రజల అభీష్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కేసీఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ పథకాలను అక్కడ కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com