Tamilisai Soundararajan : తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తనను ఇష్టారాజ్యంగా విమర్శించారని ఆరోపించారు. తనను పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కొడుకు పెళ్లికి హాజరైన ఆమె... మీడియాతో చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించడం తప్పా అని ప్రశ్నించారు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవే తన లక్ష్యమని.... ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. తెలంగాణలో తాను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని అన్నారు.
తాను ఎక్కడా రాజకీయం చేయడం లేదని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ప్రతి నెల కేంద్రానికి ఇచ్చే నివేదికలో చెప్పాల్సినవి చెబుతున్నానని అన్నారు. గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ పాటించని కేంద్ర సర్వీసుల్లోని అధికారుల విషయంలో కేంద్రమే తీసుకునే చర్యలు తీసుకుంటుందని అన్నారు. గవర్నర్‌గా తనకు అర్హతులు ఉన్నాయి కాబట్టే ఈ పదవి ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కేటీఆర్ సహా పలువురు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ తరువాత రాష్ట్రానికి వచ్చి భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు గవర్నర్ తమిళిసై. అయితే అక్కడ కూడా అధికారులు గవర్నర్ విషయంలో ప్రోటోకాల్‌ను సరిగ్గా పాటించలేదనే విమర్శలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com