TGRTC : అరుణాచలం గిరిప్రదక్షిణ టూర్

TGRTC : అరుణాచలం గిరిప్రదక్షిణ టూర్
X

ప్రతి ఏడాది కార్తీకమాసంలో తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు రెండు తెలుగురాష్ట్రాల నుంచి అరుణాచలానికి భారీగా భక్తులు తరలివెళ్తారు. గత రెండేళ్లుగా తెలంగాణ నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్​ లను తీసుకొస్తోంది. ఈ కార్తీక మాసంలోనూ అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్‌ ప్యాకేజీని టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్యాకేజ్​ లో కేవలం అరుణాచలం మాత్రమే కాకుండా మార్గమధ్యలో ప్రముఖ ఆలయాలను సందర్శించే సౌకర్యాన్ని టీజీఎస్ఆర్టీసీ కల్పించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీకం.. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం. ఈ నెలంతా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. కార్తీకమాసంలో అరుణచాల గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివెళ్తారు. ఈ ఆలయాన్నే తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు భక్తులు. అందుకే ఆ కొండ చుట్టు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లోని పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం. దీంతో ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లేనని భక్తుల నమ్మకం.

టీజీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న అరుణాచల గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజ్​ లో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యం ఉంటుంది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా.. 13 నుంచి స్పెషల్ బస్సులు అరుణాచలానికి వెళ్తాయి. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనం తర్వాత కార్తిక పౌర్ణమి రోజు అరుణాచలానికి బస్సులు చేరుకుంటాయి. అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్యాకేజీ వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్‌సెంటర్లు 040-–23450033, 040–-69440000 ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదా టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Tags

Next Story