TG : తెలంగాణలో మరో రెండురోజులు వానలు

TG : తెలంగాణలో మరో రెండురోజులు వానలు
X

తెలంగాణలో కొద్దిరోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు మండే ఎండ కాస్తుందో కూడా అర్థం కావడం లేదు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు.

ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో సైతం ఆవర్తనం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రేపటికి తూర్పు - మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హనుమకొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మధ్యాహ్నం ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి వర్షం కురుస్తుందని చెప్పారు.

Tags

Next Story