తెలంగాణలో వ్యాక్సిన్‌ పంపిణీకి సన్నాహాలు

తెలంగాణలో వ్యాక్సిన్‌ పంపిణీకి సన్నాహాలు
కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన 24 గంటల్లోనే టీకా పంపిణీ ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలో వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమవుతోంది.. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన 24 గంటల్లోనే టీకా పంపిణీ ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు రావడంతో రాష్ట్రానికి ఏ టీకా ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అన్నీ క్లియర్‌ అయితే, వారం, పదిరోజుల్లోనే కరోనా టీకా పంపిణీకి అవకాశాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.. తెలంగాణ వ్యాప్తంగా 80 లక్షల మందికి నాలుగు దశల్లో టీకా ఇవ్వనున్నారు. మొదట వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ ఐదు లక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తారు.

స్థానికంగా తయారవుతున్నందున భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కొవాగ్జిన్‌నే కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కొవాగ్జిన్‌ కావాలని కోరినప్పటికీ.. కేంద్రం సూచనల మేరకే ముందుకెళ్లాల్సి ఉంటుంది. కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని డీసీజీఏ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో కొద్ది రోజుల్లోనే టీకా తెలంగాణ ప్రజలకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా, హైదరాబాద్‌లో టీకాలిచ్చేందుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టీకాలు పంపిణీ చేయనున్నారు. రేపు అన్ని జిల్లాల వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ సమావేశం నిర్వహించనుంది. అదే రోజు డీఎంహెచ్‌వోలకు తుది శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాకు టీకా పంపిణీపై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story