తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ విజయవంతం

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ విజయవంతం
ఈ డ్రై రన్ ప్రక్రియను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరిశీలించారు.

దేశంలో కొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో డ్రై రన్‌ నిర్వహించింది. ప్రతి రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల డ్రైరన్ చేపట్టాలన్న కేంద్రం సూచన మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్‌సీ, గాంధీ ఆస్పత్రి సహా ప్రైవేటు ఆస్పత్రుల విభాగంలో సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రై రన్ చేపట్టారు.

ఈ డ్రై రన్ ప్రక్రియను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరిశీలించారు. తిలక్ నగర్ యూపీహెచ్‌సీకి వెళ్లిన గవర్నర్.. అక్కడి ఏర్పాట్లు, డ్రై రన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, ఇమ్యునైజేషన్ జేడీ సుధీర, హైదరాబాద్ డీఎంహెచ్ఓ.. తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో ప్రక్రియను పరిశీలించారు. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ట్రయల్‌ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో అధికారులు పొందుపరిచారు. పూర్తి వివరాలను మరోమారు కేంద్రానికి పంపనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.

మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జీజీహెచ్, జానంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేహా షైన్ ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియను నిర్వహించారు. నాలుగు దశలు.. టీకా వేయడం మినహా నాలుగు దశల్లో జరిగే ప్రక్రియను ఇందులో పరిశీలించారు. తొలుత వెయిటింగ్.. రెండో దశలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, మూడో దశలో వ్యాక్సినేషన్, నాలుగో దశలో పర్యవేక్షణను పరిశీలించారు. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినవారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీసిన అధికారులు.. దీర్ఘకాలిక వ్యాధులు సహా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనే వివరాలు సేకరించారు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో టీకా ఇచ్చిన తర్వాత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు డ్రైరన్ పనితీరును పరిశీలించగా... మూడు కేంద్రాల్లో ముగ్గురు ఇంఛార్జిలు పక్రియను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ ఎలా జరగనుందనేది ఈ ప్రక్రియ ద్వారా పరిశీలించిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు.

డ్రై రన్‌ వల్ల సిబ్బందికి పూర్తి అవగాహన వస్తుందన్నారు తెలంగాణ వైద్యాధికారులు. ఒక వేళ వ్యాక్సిన్‌ వలన సమస్యలు వస్తే పరిశీలన కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story