NTR : ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే బాగుండేది : విజయశాంతి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు (PV Narasimharao) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి (Vijaya santhi) స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు . ఇందులో ఆమె.. దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్‌కు (Senior NTR) కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని ఆమె కామెంట్స్ చేశారు.
భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను.అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం. అని ట్వీట్ చేశారు విజయశాంతి.
మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌తో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇటీవల బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి ఈ అవార్డు ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు మరో ముగ్గురికి అనౌన్స్ చేసింది. మొత్తంగా ఈ ఏడాది ఐదుగురిని భారతరత్న వరించింది. వీరిలో ఒక్క ఎల్కే అద్వానీ (LK Advani) తప్ప.. మిగిలిన నలుగురికి మరణానంతరం అవార్డు దక్కింది. కాగా, ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 1999లో నలుగురికి అవార్డు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com