TG: తెలంగాణలో 65 శాతం ఓటింగ్‌

TG: తెలంగాణలో 65 శాతం ఓటింగ్‌
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో మళ్లీ తక్కువే ఓటింగ్... ఇవాళ సాయంత్రం వరకు కచ్చితమైన పోలింగ్ శాతం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా 65 శాతం వరకు నమోదైంది. 10 నియోజక వర్గాల్లో పోలింగ్ 70 శాతం దాటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ మళ్లీ తక్కువే జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కచ్చితమైన పోలింగ్ శాతం తెలుస్తుందని CEO వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి EVMలనును పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఓటింగ్‌ను అధికారులు ఇవాళ పరిశీలించి.. ఎక్కైడనా రీపోలింగ్ అవసరమైతే నిర్ణయం తీసుకోనున్నారు. పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదయ్యాయి.


చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు కొలిక్కి వచ్చిన లెక్కల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 64.93 శాతం నమోదైంది. సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 9.51 శాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకొని 11 గంటలకు పోలింగ్ శాతం 24.31 శాతానికి చేరింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38శాతం పోలింగ్ శాతం పెరిగింది. క్రమంగా పెరిగిన పోలింగ్ మధ్యాహ్నం 3 వరకు 52.34 శాతానికి... సాయంత్రం 5 వరకు 61.16శాతానికి పెరిగింది. మావోయిస్టు ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ... సుమారు 1400 బూత్‌లలో అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు రాత్రి వరకు ఓట్లు వేశారు.

ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం... అత్యధికంగా భువనగిరిలో 76.47శాతం నమోదు కాగా.., అతితక్కువగా హైదరాబాద్‌లో 46.08 శాతం పోలింగ్ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సారి కూడా పోలింగ్ తక్కువగానే జరిగింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 46.08 శాతం, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 48.11... మల్కాజిగిరిలో 50.12 శాతం ఓట్లు పడ్డాయి. ఆదిలాబాద్‌లో 72.96, చేవెళ్లలో 59.94, కరీంనగర్‌లో 72.33, ఖమ్మంలో 75.19, మహబూబాబాద్‌లో 70.68, మహబూబ్ నగర్‌లో 71.54, మెదక్‌లో 74.38, నాగర్ కర్నూల్‌లో 68.86...నల్గొండలో 73.78, నిజామాబాద్ 71.50, పెద్దపల్లిలో 67.88, వరంగల్‌లో 68.29, జహీరాబాద్‌లో 74.54 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ లెక్కలను అధికారులు ఇంకా కొలిక్కి తెస్తున్నారు. ఈ సాయంత్రం వరకు కచ్చితమైన పోలింగ్ శాతం తేలుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 స్ట్రాంగ్ రూంలకు తరలించారు. నిన్న ఒక్క రోజునే 400 ఫిర్యాదులు వచ్చాయని... 38 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగిందన్న వికాస్ రాజ్.. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ను ఇవాళ ఎన్నికల అధికారులు సమీక్షించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నేడు నిర్ణయం తీసుకోనున్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.


Tags

Next Story