TG POLLS: తెలంగాణలో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎంతంటే..?

TG POLLS: తెలంగాణలో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎంతంటే..?
గత సార్వత్రిక ఎన్నికల్లో 49.6శాతం పోలింగ్.... ఈసారి 55 శాతం పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో, గత సార్వత్రిక ఎన్నికల్లో 49.6శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 55 శాతం పోలింగ్ నమోదైంది. LBనగర్‌లోని మన్సూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ వద్ద పార్టీ అనుకూల నినాదాలు చేశారని ఎన్నికల నిర్వహణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా,వారిపై కేసులు నమోదయ్యాయి.నియోజకవర్గ పరిధిలోని 3వేల 228 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలకు తరలించారు.


చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్లలో 2వేల 877 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు...... మహేశ్వరం 51.70శాతం, రాజేంద్రనగర్ 53.13, శేరిలింగంపల్లి 43.11, చేవెళ్ల 70.84శాతం, పరిగి 65.98, వికారాబాద్ 64.44శాతం, తాండూర్ 66.34 పోలింగ్‌ శాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్ధానాల్లో 60 శాతం పైన పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లా ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకోగా పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహబూబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వేములతండాలో ఓటు వేసి దానిని వాట్సప్‌లో వైరల్ చేశారు. దీంతో భారాస, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూపోలింగ్ 68 నుంచి 70శాతం మధ్య నమోదైంది. సమస్యల పరిష్కారం కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా మైలారం, మహబూబ్‌నగర్ పట్టణం ఎదిర గ్రామస్తులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కొల్లాపూర్ మండలం అమరగిరిలో చెంచులు పోలింగ్‌కు రాకపోవటంతో....... అధికారులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. పోలింగ్ పూర్తైన తర్వాత EVMలను మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు , నాగర్‌కర్నూల్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులోని......... స్ట్రాంగ్ రూంలకు తరలించారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపుగా 73.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో.. 73.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని 76వ బూత్‌లో EVMకు ఇంకు అంటడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 72.33 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పోలింగ్ పూర్తయిన EVMలను కరీంనగర్ SRR కళాశాలకు తరలించారు.నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. నియోజకవర్గంలో 71.47 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బోధన్‌ పట్టణంలో భాజపా కార్యకర్తపై..... కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయగా.. ఎంపీ అర్వింద్‌ పరామర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 73.95 శాతం.., భువనగిరిలో 72.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఆందోళనలు, కొన్నిచోట్ల ఈవీఎం మొరాయింపులు మినహా రెండు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగింది.


Tags

Next Story