WAR: అక్కడ రణం.. ఇక్కడ భయం భయం

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నగరానికీ తాకింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, పవిత్ర నగరం కూమ్ల్లో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన వందలాది మంది విద్యార్థుల క్షేమంపై వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శనివారం ఉదయం అనూహ్యంగా యుద్ధ పరిస్థితులు నెలకొనడం, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలోని పాతబస్తీ, టోలీచౌకీ, సైబరాబాద్ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు కలవరపడుతున్నాయి. లభ్యమైన సమాచారం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు టెహ్రాన్, కుమ్ నగరాల్లో వైద్య, మత, సాంకేతిక విద్యలు అభ్యసిస్తున్నారు. వీరితో పాటు ఇంజినీర్లు, వ్యాపారులు కూడా తరచూ ఇరాన్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మొత్తం రాష్ట్రానికి చెందిన వారు 2 వేల మందికిపైగా ఇరాన్లో ఉన్నారని అంచనా. యుద్ధం ఆకస్మికంగా ప్రారంభమవడంతో వారి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్ ప్రభుత్వం భద్రతా కారణాల వల్ల ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ ఉన్న విద్యార్థులతో సంప్రదింపులు కష్టమయ్యాయి. “మా పిల్లల ఫోన్లు పనిచేయడం లేదు. ఒక్క మెసేజ్ కూడా రావడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు” అంటూ పాతబస్తీకి చెందిన ఒక తల్లి కన్నీటి పర్యంతమైంది. సోషల్ మీడియా, కాల్స్ అందుబాటులో లేకపోవడం కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇదే సమయంలో ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అబిడ్స్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ , ప్రధానమంత్రి మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి జరపడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. ఈ దాడుల గురించి ముందస్తు సమాచారం భారత ప్రభుత్వానికి ఉందా అనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. భారత విదేశాంగ విధానం శాంతి, చర్చల మార్గాన్నే ప్రోత్సహిస్తుందని, ఈ దాడులు ఆ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల క్షేమంపై స్పష్టమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతుండడంతో టెహ్రాన్, కుమ్ నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
